కదళీవనము
శ్రీశైలం
భూకైలాసం నాకు కైలాసం కన్నా శ్రీశైలమే మిన్న అని మహాదేవుడు కొనియాడిన క్షేత్రం
శ్రీశైలం. ఆ శ్రీశైల మహాక్షేత్రంలో నెలవై ఉన్న అద్భుత రమణీయ ప్రశాంత ఆధ్యాత్మిక
దర్శనీయ స్థలాలలో కదళీవనం ప్రశస్తమైనది.
చరిత్ర:
శ్రీ దత్తాత్రేయ
స్వామి అవతార పరంపరలో 3వ అవతార
పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాష్ట్రలోని కరంజా నగరంలొ జన్మించి
నర్సోబవాడాలోను, కర్ణాటకలోని
గాణాగాపురంలోనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు. వీరశైవ
సంప్రదాయానికి చెందిన అక్క మహాదేవి కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి.
ఇటీవలి చరిత్ర:
మెదక్ జిల్లా
తూప్రాన్ కు చెందిన శ్రీలలితా సేవా సమితి వ్యవస్థాపకులైన బ్రహ్మ శ్రీ సోమయాజుల
రవీంద్రశర్మ శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి వ్రాసిన శ్రీ గురుచరిత్ర ఆధారంగా
శ్రీశైలంలోని ఈ కదళీవనం గురించి దాదాపు 20 సంవత్సరాలు అన్వేషించి అనంతరం 2002 ఫిబ్రవరి లో తొలిసారి కదళీవనమును సందర్శించి అక్కడ శ్రీనృసింహ సరస్వతి స్వామి
విగ్రహాన్ని కదళీవనంలో ప్రతిష్ఠించాలని సంకల్పించి 25-08-2002 నాడు ప్రతిష్ఠ గావించడం జరిగింది.
ఇంతటి
పుణ్యక్షేత్రం గురించి శ్రీశైలం దేవస్థానానికి తెలియాలనే ఉద్దేశ్యంతో దేవస్థానం
వారికి లేఖ ద్వారా తెలియపర్చడం జరిగింది.తరువాత దేవస్థానం వారు పరిశోధించి
శ్రీలలిత సేవా సమితి వారు తెలియపరిచింది నిజమే అని వారు నిర్ధారించి శ్రీశైలప్రభ
మాసపత్రిక లోనూ మరియు శ్రీశైలం దర్శనీయస్థలాలు పుస్తకం లో నూ ప్రచురించడం
జరిగింది.
శ్రీలలిత సేవా
సమితి వారిని దేవస్థానం వారు ఎంతో అభినందించడం జరిగింది.శ్రీలలిత సేవా సమితి వారు
నృసింహ సరస్వతి స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాక కదళీ వనానికి వెళ్ళేందుకు
దారి తెలిపే బోర్డ్ లను కుడా ఏర్పాటు చేసారు.
శ్రీపాద
శ్రీవల్లభ చరితామృతం:
శంకరభట్టునకు
కురువపురమున వాసవాంబిక దర్శనం కలిగి "సమస్త కల్యాణగుణములకు నిలయమైన ఓ
వాసవాంబికా! "నీ సంకల్పమే నెరవేరు గాక! నేను ఇంకనూ 14 సంవత్సరములు అనగా యీ శరీరమునకు 30 సంవత్సరములు వచ్చు పర్యంతము యీ శ్రీపాద
శ్రీవల్లభ రూపముననే యుండి ఆ తదుపరి గుప్తమయ్యెదను. తిరిగి సన్యాస ధర్మము
నుద్ధరించు నిమిత్తము నృసింహ సరస్వతీ నామము నొంది, ఆ అవతారములో 80 సంవత్సరముల వయస్సు వచ్చువరకును ఉండెదను.
తదుపరి కదళీవనము నందు 300 సంవత్సరములు తపోనిష్టలో
నుండి ప్రజ్ఞాపురమున స్వామిసమర్థ నామధేయముతో అవతారమును చాలించెదను. అవధూతల
రూపములతోను, సిద్దపురుషుల
రూపములతోను అపరిమితమైన నా దివ్యకళలతో లీలలను, మహిమలను చేయుచూ లోకులను ధర్మకర్మానురక్తులుగా
చేసెదను." అని అనిరి.
అద్భుత జలపాతం:
అక్కమహాదేవి గుహ
నుంచి స్వామివారు తపస్సు చేసిన మరో గుహకి వెళ్లాలంటే... మరో 6 కిలోమీటర్లు ముందుకెళ్లాలి. వెళ్తున్నకొద్దీ
అడవి చిక్కబడుతుంది, చెట్ల సందుల్లోని
చిన్న దారిలో వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ చెట్లు, పుట్టలు, పొదలు, అక్కడక్కడా వాగులు, నాచుపట్టిన
రాళ్లను జాగ్రత్తగా దాటుకుంటూ 3 గంటలు ప్రయాణించి
ముందుకెళ్తే గుహకి చేరుకుంటాం.గుహ వద్దకు అడుగుపెట్టగానే సంతోషంతో గట్టిగా
కేకలేయకుండా ఉండలేం. ఎందుకంటే, అక్కడ ఓ అందమైన
జలపాతం ఉంటుంది. చాలా ఎత్తునుంచి నీళ్లు జారిపడుతూ అద్భుతంగా ఉంటుంది ఆ జలపాతం. ఈ
జలపాతం పక్కనే ఉన్న గుహలోనే స్వామివారు తపస్సు చేశారట. ఇప్పుడు అక్కడ ఒక శివలింగం
ఉంది. ఇక్కడికి వచ్చే సందర్శకులు జలపాతం నీటితో శివలింగానికి అభిషేకం చేసి
పూజిస్తుంటారు.
మార్గం:
శ్రీశైలంలోని పాతాళగంగ నుండి 16కిమీలు నీటిలో ప్రయాణించి నీలిగంగ రేవు ఒడ్డు నుంచి సుమారు 8 కి.మి.లు అడవిలో నడచి కదళీవనాన్ని చేరవచ్చు.