Wednesday, October 21, 2015

ద్వారకా తిరుమల (Dwaraka tirumala)



ద్వారకా తిరుమల




     ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు వచ్చినది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందినది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు.

"పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము.


పేరు వెనుక చరిత్ర:
                              ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో వుంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడు, ఆయనకు ముసలితనం వచ్చి ఆలయానికి అంతదూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు. ఐతే చెట్లుకొట్టి కట్టెలు అమ్ముకోవడం-దారుకము వృత్తిగా కలవారు , దారువులు(చెట్లు) ఎక్కువగా వుండడంతో, మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం వుంది.[2] తిరుమలను పెద్ద తిరుపతిగా వ్యవహరిస్తూ ఆ క్రమంలోనే దీనిని చిన్న తిరుపతిగా వ్యవహరిస్తూంటారు.

ప్రధానాలయం:

                          ప్రస్తుతము ఉన్న గుడిని మైలవరం జమీందారులు కట్టించారు. విమానము, మంటపము, గోపురము, ప్రాకారాలను ధర్మా అప్పారావు (1762-1827) కాలంలో కట్టించారు. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు రాణీ చిన్నమ్మరావు (1877-1902) సమర్పించారు.


స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలము నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్టించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.

ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహము క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చును. ఈ గుడి యొక్క సాంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు కళ్యానోత్సవములు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం- స్వయంభూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్టించారనీ చెబుతారు.

గుడి ప్రవేశంలో కళ్యాణ మంటపం ఉంది. మంటపం దాటి మెట్లు ఎక్కే ప్రాంభంభంలో (తొలిపమెట్టు వద్ద) పాదుకా మండపంలో స్వామి పాదాలున్నాయి. శ్రీపాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు ప్రక్కలా దశావతారముల విగ్రహములు ప్రతిష్టింపబడినవి. మెట్లకు తూర్పునైపున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం ఉన్నాయి. పడమటివైపు పద్మావతి సదనం, దేవాలయం కార్యాలయం, నిత్యకళ్యాణ మండపం ఉన్నాయి.


ప్రధాన ద్వారం లోపల ఇరువైపుల, గర్భగుడికి అభిముఖంగా, ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం పైభాగాన (లోపల) సప్తర్షుల విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 మంది ఆళ్వారుల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మంటపం ఉన్నది. ప్రధాన మందిరంలో ఆంజనేయస్వామి, గరుడస్వామిల చిన్న మందిరాలు (ధ్వజస్తంభం వెనుక) ఉన్నాయి.

గర్భగుడిలో స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్టింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజ చేస్తారు.


ప్రధానాలయానికి తూర్పువైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, పడమటినైపున తిరువంటపడి పరికరాలశాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం ఐదు అంతస్థులది. గోపురములో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు. గుడి ప్రాకారము చుట్టూ పన్నెండుగురు ఆళ్వారుల విగ్రహములు ప్రతిష్టింపబడ్డాయి.

పడమరవైపు ప్రక్కనే తలనీలాలు సమర్పించుకొనే కళ్యాణ కట్ట ఉన్నది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం ఉన్నాయి.

పుష్కరిణి:
               గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్ధమనీ అంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్ళపై సుదర్శన (చక్రం) ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. 199లో పుష్కరిణి మధ్య మడపం నిర్మించారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) నాడు తెప్పోత్సవం జరుపుతారు. గ్రామం లోపల విలాస మండపం, క్షీరాబ్ది మండపం, ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపం అనే కట్టడాలు వేరువేరు చోట్ల ఉన్నాయి. పర్వదినాలలో తిరువీధుల సేవ జరిగినపుడు ఆయా మండపాలలో స్వామిని "వేంచేపు" చేసి, అర్చన, ఆరగింపు, ప్రసాద వినియోగం జరుపుతారు.

అర్చన, కైంకర్యం, ఉత్సవాలు:
నిత్య కార్యక్రమాలు - సుప్రభాతం, తీర్ధపు బిందె, ప్రాతఃకాలార్చన, బాలభోగము, గోష్ఠి, ప్రత్యేక దర్శనము (06:00 నుండి 13:00),
అర్జిత పూజలు, వేద పారాయణము, మహా నివేదన (12:00), విరామం (13:00 నుండి 15:00 వరకు దర్శనం ఉండదు),
ప్రభుత్వోత్సవము, సర్వ దర్శనము (15:00 నుండి 17:00 వరకు), పంచాంగ శ్రవణము, ప్రత్యేక దర్శనము (17:00 నుండి 21:00 వరకు)
సాయంకాలార్చన, సేవాకాలము, పవళింపు సేవ, ఏకాంతసేవ తీర్మానము (21:00)
విశేష ఉత్సవాలు - 
ప్రతినెల ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య తిథులకు, పునర్వసు, శ్రవణ నక్షత్రాలకు, సంక్రమణం రోజులలో- రాత్రి 7:30కి విశేష ఉత్సవం - ప్రత్యేకమైన మూల మండపంలో స్వామివారి వేంచేపు, అర్చన, ప్రసాద వినియోగం
ఉగాది ఉత్సవం - చైత్రమాసం ఉగాదికి - ఉగాది మండపంలో వేంచేపు, పంచాంగ శ్రవణం, పండిత సన్మానము
శ్రీరామనవమికి శ్రీసీతారామకళ్యాణం, కృష్ణాష్టమికి ఉట్లపండుగ
తిరుకళ్యాణోత్సవాలు - వైశాఖమాసం (శుద్ధ దశమి నుండి నిదియ వరకు) మరియు ఆశ్వయుజమాసం (విజయ దశమి నుండి విదియ వరకు) - అలంకరణ, సాంస్కృతిక ఉత్సవాలు, భజనలు, ఉపన్యాసాలు, కళ్యాణోత్సవం, రధోత్సవం వంటివి.
పవిత్రోత్సవాలు - శ్రావణ మాసంలో - శుద్ధ త్రయోదశినుండి మూడు రోజులు - పూర్ణిమనాడు పూర్ణాహుతి
తెప్పోత్సవం - కార్తీక మాసం క్షీరాబ్ధి ద్వాదశి నాడు - సుదర్శన పుష్కరిణిలో
అధ్యయన ఉత్సవాలు - మార్గశిరమాసం - ధనుర్మాసం నెల రోజులు ఉదయం తిరువీధి సేవ- ముక్కోటి ఏకాదశినాడు ఉత్తర ద్వార దర్శనం, తరువాత 11 రోజులు అధ్యయన ఉత్సవం మరియు రాత్రి తిరువీధి సేవ.
గోదా కళ్యాణం - పుష్యమాసం - భోగి నాడు- మరియు తిరువీధి సేవ
గిరి ప్రదక్షిణము - పుష్యమాసం - కనుమ నాడు- తిరువీధి సేవలో స్వామివారు గ్రామం పొలిమేర దాటి దొరసానిపాడులో ప్రత్యేక మండపంలో అర్చన, ప్రసాదానంతరం గిరిప్రదక్షిణ పూర్వకంగా ద్వారకా తిరుమల గ్రామంలో ప్రవేశిస్తారు.
మాఘ మాసం రధ సప్తమి, ఫాల్గుణ మాసం డోలా పౌర్ణమి దినాలలో విశేషముగా తిరువీధి సేవలు జరుగును.

ఇతర ఆలయాలు:

భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయం :
                                                                       కొండపైన ప్రధానాలయానికి నాయువ్య దిశలో కొద్దిదూరంలోనే కొండమల్లేశ్వరస్వామి, భ్రమరాంబికల ఆలయం ఉంది. భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు. మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదనీ, తలపైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ చెబుతారు. ఈ దేవాలయంలో గణపతి, భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి కొలువుతీరు ఉన్నారు. నవగ్రహ మందిరం కూడా ఉంది. ఆలయం తూర్పున "శివోద్యానం" అనే పూలతోట ఉంది. సమీపంలోనే టూరిజమ్ డిపార్ట్‌మెంటు వాఱి "పున్నమి" అతిథి గృహం ఉంది. ఇటీవలి కాలంలో కొడపైభాగాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

కుంకుళ్ళమ్మ (రేణుకా దేవి) ఆలయం
                                                                         కొండకు 1 కి.మీ. దూరంలో, భీమడోలు నుండి ద్వారకా తిరుమల మార్గంలో "కుంకుళ్ళమ్మ" ఆలయం ఉంది. ఈమె ఈ వూరి గ్రామదేవత. ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకొన్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.
వెంకటేశ్వర స్వామి, జగన్నాధ స్వామి ఆలయాలు : 
                                                          ద్వారకా తిరుమలకు 2 కి.మీ. దూరంలో, భీమడోలు మార్గంలో ఉన్నాయి. హవేలి లింగపాలెం గ్రామ పరిధిలో షుమారు 130 సంవత్సరాల క్రితం పూరీ (ఒడిషా)కి చెందిన "మంత్రరత్నం అమ్మాజీ" అనబడే లక్ష్మీదేవి అనే భక్తురాలు ఇక్కడ తమ ఇలవేల్పు వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మింపజేసింది. అప్పటినుండి ఆ గ్రామానికి లక్ష్మీపురం అనే పేరు వాడుకలోకి వచ్చింది. వారిది పూరీ జగన్నాధమఠం కనుక జగన్నాధ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు, జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్ర, ఆళ్వారుల సన్నిధులు ఉన్నాయి. ద్వారకా తిరుమలను ఎగువ తిరుపతిగాను, ఈ లక్ష్మీపురాన్ని దిగువ తిరుపతిగాను భక్తులు భావిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈ స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. 1992 లో ఈ ఆలయాన్ని నిర్వహణ కొరకు ద్వారకాతిరుమల దేవస్థానానికి అప్పగించారు.

కొండక్రింద గ్రామంలో సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. పుష్కరిణి మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. ఉగాది మండపం ఎదురుగా రామాలయం ఉన్నది.


చూదదగిన ప్రదేశాలు:
                                          భ్రమారంబా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శివోద్యానం అనే తోట ఉంది. పుష్కరిణి మార్గంలో నందనవనం అనే తోటను, ప్రధానాలయం వెనుక నారాయణ వనం అనే తోటను పెంచుతున్నారు.
భీమడోలువద్ద స్వామివారి నమూనా ఆలయం ఉంది.

వసతి విశేషాలు:
                             పద్మావతి అతిధి గృహం, అండాళ్ అతిధి గృహం, రాణి చిన్నమయ్యరావు సత్రం, సీతా నిలయం, టి.టి.డి. అతిధి గృహం వంటి వసతి గృహాలు దేవస్థానంచే విర్వహింపబడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రైవేటు వసతి గృహాలున్నాయి.

ద్వారకా తిరుమల ఎలా వెళ్ళాలి ?
                                    ద్వారకా తిరుమలనుండి తూర్పు యడవల్లి సీతారామచంద్ర దేవస్థానానికి, లక్ష్మీపురం సంతాన వేణుగోపాల జగన్నాధస్వామి ఆలయానికి, కుంకుళ్ళమ్మ ఆలయానికి ఉచిత బస్సు సదుపాయం ఉంది.


ఈ క్షేత్రం విజయవాడ - రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కి.మీ., భీమడోలుకు 17 కి.మీ., తాడేపల్లి గూడెంకు 47 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. భీమడోలులో పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి. ఈ పట్టణాలనుండి, మరియు చుట్టుప్రక్కల ఇతర పట్టణాలనుండి ప్రతిదినం అనే ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులున్నాయి.