Friday, October 23, 2015

అహోబిలం (Ahobilam)


అహోబిలం
దేశం  :   భారతదేశం
రాష్ట్రం :    ఆంధ్ర ప్రదేశ్
జిల్లా  :     కర్నూలు
మండలం : ఆళ్లగడ్డ



           అహోబలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలంను అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలం నందు ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలం నందు వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించినాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు. నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో కలదు. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలం లో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరప భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబలక్షేత్రం. దిగువ అహోబలం నందు వెలసిన ప్రహ్లదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో దివ్యప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవసించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి కలవు. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అళ్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి. వేంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్టించి ఆరాధించినాడు కావున ఈ ఐదిక్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మంటపం కలదు. ప్రహ్లాద వరదుడు ఉభయనాంచారులయిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్ర పర్వంగా నిలిచింది. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వసం ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచినారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు, ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం పడి నలిగిపోయింది. రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జీయరుగారికి అహోబిలక్షేత్రాన్ని అప్పగించి, జయానికి గుర్తుగా ఉన్నతోన్నత మయిన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు. పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి. తురుష్కుల దండయాత్రలో విచ్ఛిన్నమయిన అహోబల్ క్షేత్రానికి 43వ పీఠాధిపతి పంచసంస్కారాలలో 44వ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబలం మేనేజర్ గా నియమితులయిన ఆర్. లక్ష్మినారాయణ కాలమునుండి పూర్వవైభవాన్ని సంతరించుకుంటూ వస్తున్నది. ఇతను వేద, ప్రభంధము, అధ్యయనము, మూర్తులకు అలంకారము చేయడంలో నిష్ణాతులు. ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు. అదే క్రమంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది. అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు, ఏకాంత సేవల వరకు సొగసులను నింపుకున్నది. నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు, అమ్మవారు, అద్దాల మంటపం నందు వింత వెలుగులు విరజిమ్ముతున్నారు. విజయదశమి, సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు, చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్ధం పడతాయి. ఆలయ విధులలో పూజ పునస్కారములలో తెలిసో తెలియకో జరిగిన శైతిల్యాలకు ప్రాయశ్చిత్తంగా, వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రభంధ పారాయణములు, కళ్యాణోత్సవములు, ఆలయపాలకులు అనితరసాధ్యంగా నిర్వహిస్తారు. తీర్థయాత్రలలో ప్రధానమయిన మండపం (తలనీలాలు), స్నానం దర్శనం మొదలయిన వాటికిక్కడ అవకాశమేర్పడింది. దిగువ అహోబిలం చేరుకుని, ప్రహ్లాదవరదుని సేవించుకొని ఇక్కడికి 8 కి.మీ దూరములోనున్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పుణీతమై తీర్ధయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది.
చరిత్ర:


         ఈ క్షేత్రాన్ని 1830ల్లో కాశీయాత్రచేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రా చరిత్రలో వర్ణించారు. ఆయన వ్రాసిన ప్రకారం 1830 నాటికి ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి నడుమ చీకటిగల అడవి ఉండేది. అప్పటికి ఈ స్థలం కుంభకోణం వద్దనుండే అహోబళం జియ్యరు వారి ఆధీనం. వారి ముద్రకర్త అహోబిలానికి రెండు క్రోసుల దూరానగల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు. ముద్రకర్త యెగువ, దిగువ స్థలాల్లో అర్చన చేసే అర్చకులిద్దరికీ అప్పుడప్పుడూ నెలకు రూ.6 చొప్పున జీతం ఇస్తూవుండేవారు. గుడి ఖర్చులకు జియ్యరు పంపే డబ్బు తప్ప మరే దారీ ఉండేది కాదు. హైదరాబాద్ రాజ్యపు దివాను పేష్కరు రాజా చందులాలా ఈ క్షేత్రానికి సంవత్సరానికి రూ.వెయ్యి చొప్పున ఇప్పించేవారు. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని, ఎగువన అవీ లేవని, జలము రోగప్రదం కావడంతో మనుష్యులు నివశించేందుకు భయపడేవారని వ్రాశారు. ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది. ఏవి కావాల్సినా బాచపల్లె నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. అక్కడ ప్రతిఫలించియున్న పరమాత్మ చైతన్యము, స్వప్రకాశము చేత లోకులకు భక్తిని కలగజేయుచున్నది గాని, అక్కడ నడిచే యుపచారములు దానికి నేపాటికిన్నీ సహకారిగా నుండలేదు. అని ఆయన వ్రాశారు.

అహోబల మహత్యం:
                             ఈ పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్థలమే ఈ అహోబిలక్షేత్రము. ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతం నందు బ్రహ్మాండపురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు, 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడినది.

పార్వేట:
              అహోబిల స్వామి వారు తన పెళ్ళికి తానే స్వయంగా భక్తులను అహ్వాఇస్తానని అన్నారట. ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ నాటి ప్రప్రధమ పీఠధి పతి శ్రీ శఠ గోప యతీంద్ర మహదేశికన్ వారు ఈ బ్రహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆ నాటి నుండీ ఈ నాటివరకు పర్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరగడం ఒక విశేషము. తిరుమలలో కూడ శ్రీ వారికి పార్వేట ఉత్సవాలు జరుగుతాయి. అటు పిమ్మట బ్రంహ్మోత్సవాలు జరిగిగరుడోత్సవంతో అనగా మర్చి 17 న ఈ వేడుకలు పూర్తవుతాయి. అహోబిల స్వామి వారుతన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు 35 గ్రామాల్లో ఈ నలబైదు రోజులు సంచరిస్తాడు. పర్వేట ఉత్సవాలు ఈ గ్రామాలలో ఆ నలబైదు రోజులు జరుగుతాయి. ఈ నెలన్నర రోజులు అన్ని గ్రామాల్లో అందరికి పండగే. అన్ని వేడుకలె. స్వామి వారి పల్లకి మోసే బాధ్యత ఇక్కడి కొన్ని కుటుంబల వారికి తరతరాలుగా వంశ పారంపర్యంగా వస్తున్న ఒక సంప్రదాయము. సుమారు 120 మంది ఈ విధంగా స్వామి వారి సేవలో తరిస్తున్నారు.

ఇక్కడ ప్రసిద్ధి చెందినవి:
  1.  లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది.
  2. దిగువ అహోబిలం ఆలయం
  3. ఉగ్ర స్థంబము
  4. ఉగ్ర నరసింహ స్వామి
  5. భవనాశని జలపాతము
  6. అహోబిలం దేవాలయంలోని ఒక స్తంభం.

ఎగువ అహోబలము:


                         ఎగువ అహోబిలం నందు వేంచేసియున్న మూల విరాట్ కు ఉగ్రనరసింహస్వామి అహోబిల, అహోబల, నరసింహస్వామి, ఓబులేసుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయము కలదు.

దిగువ అహోబలము:


శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్టించిన లక్ష్మీనరసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం.

కీర్తించిన వారు: నమ్మాళ్వార్-తిరుమంగై ఆళ్వార్.

సాహిత్యంలో:
శ్ల్లో. తీర్థై రింద్ర సుపావనాశ నరసింహాఖ్యానకై రంచితే
  లక్ష్మీం ప్రాస్య గుహం విమాన ముపయన్ శ్రీ నారసింహో హరి:|
  దివ్యేహోబిల పట్టణే విజయతే ప్రాచీ దిశాస్యాననో
  ప్రహ్లాదాక్షి పదం గత: కలిరిపు శ్శ్రీమచ్చఠారి స్తుత:||

పాశురం:
పా. అజ్గణ్ -ఇల- అజ్గోరాళరియాయ్, అవుణన్
  పొజ్గవాగమ్‌ వళ్ళుగిరాల్; పోழ்న్ద పునిద నిడమ్;
  పైజ్గాణనై క్కొమ్బుకొణ్డు; పత్తిమైయాల్; అడిక్కిழ்చ్
  చెజ్గణాళియిట్టిఱై -మ్‌ శిజ్గవేழ்; కున్ఱమే.
     తిరుమంగై ఆళ్వార్లు-పెరియతిరుమొழி 1-7-1

వైవిధ్యమైన నరసింహస్వామి ఆలయాలు:
ఈక్షేత్రమున నవనారసింహులు కలరు. ఇక్కడగల అహోబిల మఠములోను లక్ష్మీనరసింహర్ వేంచేసియున్నారు.
ఆలయం                           ప్రదేశం      
లక్ష్మీనరసింహం                 దిగువ అహోబిలం 
సత్తిరాంత నరసింహం                                 -   
యోగనరసింహం                తేరువీథిలో 2 కి.మీ.
కారంగి నరసింహం                     పై అహోబిలం
ఉగ్రనరసింహం                      దిగువ అహోబిలం
భార్గవ నరసింహం                           గరుడాద్రి  
పర్ములిధి నరసింహం                           వేదాద్రి
వరాహ నరసింహం                                    -
ప్రహ్లాద నరసింహం                            గంధాద్రి
అహోబిల పర్వతము చుట్టును అనేక సన్నిధులు తీర్థములు కలవు.

వసతి సౌకర్యాలు:
అహోబిలంలో వసతి సౌకర్యములు ఇంకా సరిగ్గా లేవు. వసతి కోసం మూడు అవకాశములు ఉన్నవి.
 ·       తిరుమల తిరుపతి దేవస్థానము వారి అతిధి గృహములో ఉండవచ్చు. లేదా అహోబిలం మఠంలో ఉండవచ్చు.
·         దగ్గరలోని పట్టణం, ఆళ్ళగడ్డలో ఉండవచ్చు. అది 30 కి.మీ దూరంలో ఉంది లేదా 70 కి.మీ దూరంలో వున్న నంద్యాలలో వుండవచ్చు.
·         ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ టూరిజం వారి భోజన హోటల్ కలదు.
దర్శనీయ స్థలాలు:
నవ నారసింహ గుళ్ళు:
                        అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు.

 జ్వాలా అహోబిల మాలోల క్రోద కారంజ భార్గవ
 యోగానంద క్షాత్రవత పావన నవ మోర్థ్యః

  1. జ్వాలా నరసింహ.
  2. అహోబిల నరసింహ: గరుత్మంతునికి దర్శనమిచ్చిన నరసింహ స్వామి.
  3. మాలోల నరసింహ: లక్ష్మీదేవికి ప్రియమైన నరసింహస్వామి.
  4. క్రోద నరసింహ (వరాహ నారసింహ).
  5. కారంజ నరసింహ.
  6. భార్గవ నరసింహ.
  7. యోగానంద నరసింహ.
  8. క్షాత్రపత నరసింహ (ఛత్రవట నారసింహ).
  9. పావన నరసింహ.

                                  అను తొమ్మిది నరసింహ దేవాలయములు ఈ క్షేత్రమున కలవు. ఇప్పుడే కొద్దికొద్దిగా రోడ్డుమార్గములు వేస్తున్నరు అన్నీ నడచిపోవాలంటే మీకు రెండు రోజులు పడుతుంది. జ్వాలా నరసింహస్వామి క్షేత్రము దగ్గర భవనాశని అనే జలపాతము ఉంది. అక్కడ స్నానంచేస్తే సకల పాపాలు పోతాయి అని భక్తుల నమ్మకం.

ప్రహ్లాద బడి:
                ఇది చిన్న గుహ. దీనినే ప్రహ్లాద బడి అంటారు. ఈ గుహ ఎదురుగా కొండలపైనుండి నీరు పడుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుహ ఎదురుగా విశాలమైన రాళ్ళ చప్టాలాగా సహజసిద్ద కొండ ఉంటుంది, దానిపైన రకరకాల అక్షరాలు వ్రాసినట్లు గీతలు ఉంటాయి. ఈ అక్షరాలలో చాలా వాటికి పోలికలు గమనించవచ్చు! ఈ గుహలోకి ఒకేసారి కేవలం ఐదుగురు మాత్రమే వెళ్ళగలుగుతారు.

మఠం:
             అహోబిలం మఠం చాలా ప్రసిద్ధి పొందినది. ఇది వైష్ణవ మత వ్యాప్తిలో కీలక భూమిక పోషించింది. సంకీర్తనాచార్యుడు, అన్నమయ్య ఇక్కడనే దీక్షపొంది మంత్రోపదేశం పొందినాడు. (లేదా వారి గురుపరపంపర ఈ మఠానికి సంబందించినది). ఇది దిగువ అహోబిలంలో ఉన్నది. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము చాలా అందంగా, శిల్పకళలతో విలసిల్లుతుంది. మఠంలోనూ నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి. వీని పూజాపునస్కారాలు చూడదగ్గవి.

ఉగ్ర స్థంభం:
                ఇది అహోబిలంలోని ఎత్తైన కొండ, దీనిని దూరం నుండి చూస్తే ఒక రాతి స్థంబం మాదిరిగా ఉంటుంది. దీనిని చేరుకోవడం కొంచెం కష్ష్టం, కానీ ఒకసారి దీనిని చేరుకుంటే మంచి ట్రెక్కింగు చేసిన అనుభూతినిస్తుంది.

దీని పైన ఒక జండా (కాషాయం), నరసింహస్వామి పాదాలు ఉంటాయి.

దీని నుండే నరసింహస్వామి ఉద్భవించినాడని ప్రతీతి.

జ్వాలానరసింహ, భవనాశని దగ్గరలోని చిన్న కొండ అధిరోహించు రహదారి గుండా దీనిని చేరుకోవాలి.

చేరుకొను విధము:
                        కడప రైల్వే స్టేషన్‌లోదిగి అక్కడ నుండి బస్‌లో 90 కి.మీ.దూరంలోని "ఎర్లకట్ట" అనే చోటదిగి అక్కడ నుండి వేరుబస్‌లో 25 కి.మీ. దూరంలో ఈ క్షేత్రము చేరవచ్చును. నంద్యాల నుండి 45 కి.మీ. బస్ సౌకర్యం కలదు. అన్నివసతులు కలవు.

రోడ్డు మార్గము:
                            హైదరాబాదు నుండి అహోబిలం వెళ్ళేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.
రైలు మార్గము:
                          అహోబిలం దగ్గరలోని రైలు సముదాయము నంద్యాల.
విమాన మార్గము:
                             అహోబిలం దగ్గరలోని విమానాశ్రయం హైదరాబాదు, అక్కడనుండి మీరు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు.