హటకేశ్వరం
రాష్ట్రం :ఆంధ్ర ప్రదేశ్
జిల్లా :కర్నూలు
మండలం :శ్రీశైలం
హటకేశ్వరం,
కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామము. శ్రీశైలమల్లిఖార్జున దేవస్థానమునకు మూడు
కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం.ఇక్కడ హటకేశ్వరాలయము కలదు. ఈ
పరిశరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు నివశించారు.
చరిత్ర:
పరమశివుడు అటిక
(ఉట్టి, కుండ పెంకు)లో
వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదేమెల్లగా
హటికేశ్వరస్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆప్రాంతానికి రాకపోకలు సాగించే
భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువ బడుతోంది. ఇక్కడ చెంచులు అదివాశీలు
నివసిస్తున్నారు. ఈ దేవాలయ పరిసరాలలో పలు ఆశ్రమములు, మఠములు కలవు. ఇక్కడికి వచ్చెందుకు శ్రీశైలం
దేవస్థానము నుండి ప్రతి అర గంటకు బస్సులు కలవు.
ఒక చిన్న కథ:
హటకేశ్వరం
క్షేత్రం గురించి చెప్పుకునేటప్పుడు ... మహాభక్తుడైన కుమ్మరి కేశప్ప గురించి కూడా
తప్పని సరిగా చెప్పుకోవలసి వస్తుంది. నిస్వార్ధమైన సేవతో ... అనితర సాధ్యమైన
భక్తితో సాక్షాత్తు సదాశివుడి అనుగ్రహాన్ని పొందిన కేశప్ప , శ్రీ శైలం సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తూ
ఉండేవాడు. కుమ్మరి కులానికి చెందిన కేశప్ప ... తన వృత్తిని చేసుకుంటూనే, శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతులు
ఏర్పాటు చేసేవాడు.
శివయ్య
దర్శనానికి వెళ్లే వారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ ...... దారి పొడవునా
ఆయన గురించి చెప్పుకుంటూ వుండేవారు. దాంతో కుమ్మరి కేశప్ప పేరు అందరికీ
సుపరిచితమైపోయింది. ఇది సహించలేకపోయిన ఇరుగుపొరుగువారు ... ఓ రాత్రి వేళ అతని
కుండలను పగులగొట్టడమే కాకుండా, కుండలను తయారు
చేసే 'అటికె'ను కూడా పాడు చేశారు.
తెల్లారగానే
జరిగింది చూసిన కేశప్ప లబోదిబోమన్నాడు. శివరాత్రి పర్వదినం రావడంతో యాత్రికుల
సంఖ్య పెరిగింది. అటికె పాడైపోయినందున ఏం చేయాలో పాలుపోక కేశప్ప దిగాలు పడిపోయాడు.
ఎలాగైనా అటికెను బాగు చేయాలనే ఉద్దేశంతో నానా తంటాలు పడసాగాడు. అదే అదనుగా
భావించిన ఇరుగు పొరుగు వారు కావాలని చెప్పేసి భోజనం కోసం అతని ఇంటికి యాత్రికులను
పంపించారు.
అమ్మడానికి
కుండలు లేవు ... తయారు చేయడానికి అటికె లేదు. యాత్రికులను సాదరంగా ఆహ్వానించిన
కేశప్ప, ఎలా భోజనాలు
ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు అటికె
పై శివుడు ప్రత్యక్షమై, లోపలోకి వెళ్లి
యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్పాడు. శివుడికి నమస్కరించి లోపలి వెళ్ళిన
కేశప్ప కి అక్కడ కుండల నిండుగా వివిధ రకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది.
దానిని యాత్రికులకు కడుపు నిండుగా ... సంతృప్తిగా వడ్డించాడు.
శివుడు అటికె లో
ప్రత్యక్షమైన ఈ ప్రదేశమే 'అటికేశ్వరంగా'
పిలవబడి కాలక్రమంలో 'హటకేశ్వరం'గా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు సదాశివుడే
ఆవిర్భవించేలా చేయగలిగిన మహా భక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు.
విశేషాలు:
- ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం కలదు.
- హటకేశ్వరం దేవాలయానికి వెళ్ళే దారికి ఎదురు దారిలో పాలదార-పంచదార లు కలవు.
- ఇక్కడే ఆదిశంకరాచార్యుడు చాలాకాలం తపస్సు చేసినది. ఒక బండపై అయన కాలిముద్రలు కలవు.
- ఇక్కడ వివిధ రకముల మూలికలు, తేనె మరియు సరస్వతి ఆకు లభిస్తాయి.