Thursday, November 5, 2015

ద్రాక్షారామం (Draksharamam)

ద్రాక్షారామం
రాష్ట్రం        :   ఆంధ్ర ప్రదేశ్
జిల్లా          :   తూర్పు గోదావరి
మండలం:   రామచంద్రపురం



                               ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసియున్నది. తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరము కాగా, మరొకటి శ్రీశైలము.
                      త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం ఒప్పారుతోంది.
                          శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతీ గ్రంథం అన్న ప్రాకృతభాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని, సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటేరకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు. తిట్టుకవి గా ప్రసద్ధి నందిన వేములవాడ భీమకవి " ఘనుడన్ వేములవాడ వంశజుడ, ద్రాక్షారామ భీమేశునందనుడన్.... " అని చెప్పుకొన్నాడు. అతనికి కవిత్వం అబ్బటం స్వామి ప్రసాదం అయి ఉండవచ్చు.ఎంతో మంది తెలుగు కవులు శ్రీ భీమేశ్వరస్వామి ని తమ పద్యాలలో కీర్తించినారు. వాటిలో ఈమధ్య వచ్చిన "దక్షారామ భీమేశ్వర శతకం" ఒకటి. దీనిని ప్రొఫెసర్ వి.యల్.యస్. భీమశంకరం రచించాడు.

పేరు వెనుక చరిత్ర:

                                       పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది. ఒకప్పుడు ఇది దాక్షారామంగా పిలువబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది.తన భర్తకి ఆహ్వానం లేకపోయినప్పటికీ పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చి అవమానంపాలైన పరమశివుని సతి సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. తన భార్యను అవమాన పరిచినందుకు గాను వీరభద్రుడిని సృష్టించిన శివుడు దక్షుడి తల నరికించాడు. సతీదేవి వియోగ వివశత్వం నుంచి శివుడిని బయటపడేయడం కోసం శ్రీ మహా విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేశాడు. ఆమె శరీర అవయవాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి.

భీమేశ్వరాలయం:

                                                 ద్రాక్షారామంలో శివుడు భీమేశ్వరుడిగా స్వయంభువు గా అవతరించాడు. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా పంచారామాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి' అని పిలుస్తూ వుంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు.

అష్ట లింగాలు:
                                    ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్టించాడని విశ్వసించబడుతుంది.తూర్పున కోలంక ,పడమర వెంటూరు,'దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో దంగేరు. నైరుతిలో కోరుమిల్లి'వాయువ్యంలో సోమేశ్వరం ఈశాన్యాన పెనుమళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర మరియు కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక తూర్పు ,పశ్చిమ ,ఉత్తర , దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది.

స్థలపురాణం:

                       పూర్వము తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించెను. ఆ రాక్షసుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించెను. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఆ లింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా, అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా తనకు మరణం లేకుండ వరం పొంది ఉన్నాడని చెప్పగా, మన్మధ ప్రేరేపణచేత పార్వతీ కళ్యాణం, అనంతరం 'కుమార సంభవం' జరుగగా ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా, కుమార స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై భూమిమీద అయిదు చోట్ల పడెను. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను. అవి వరుసగా అమరావతి, భీమవరం, పాలకొల్లు,ద్రాక్షారామం,సామర్లకోట ఇలా భూమి మీద పడిన ఆత్మలింగాలు కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించెను. అలా ఎదిగి పోతూ ఉంటే కలియుగం వచ్చేసరికి మానవులకు అభిషేకాలకు గాని, దర్శనానికి గాని అందకుండా పోతాయని ఒక్కోచోట పడిన ఆత్మలింగానికి ఒక్కొక్క దేముడు అవి ఎదిగిపోకుండా ప్రతిష్ట చేసి అభిషేకార్చనలు చేసారు. ఆఅ దేవుడు ప్రతిష్ఠ చేసిన లింగం ఆయా దేవుని పేరుతో పిలవబడుతోంది.

అమరావతి:- ఇక్కడ ఇంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి 'అమరేశ్వరస్వామి ' గా వెలిసెను.
భీమవరం:- ఇక్కడ చంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి 'సోమేశ్వరస్వామి ' గా వెలిసెను.
పాలకొల్లు:- ఇక్కడ శ్రీ రామచంద్రమూర్తి ప్రతిష్టించాడు కాబట్టి క్షీరారామలింగేశ్వరస్వామి ' గా వెలిసెను.
సామర్లకోట:-ఆత్మలింగాన్ని చేధించిన దోషం తనకు రాకూడదని కుమారస్వామే స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించెను కాబట్టి 'కుమారారామ భీమేశ్వరస్వామి 'గా వెలిసెను.



దైనందిన కార్యక్రమాలు:
ప్రతీరోజు ఉదయం

5:00 మేలుకొలుపు,సుప్రభాతం,
5:30 ప్రాతఃకాలార్చన,తీర్ధపుబిందె,
5:45 బాలభోగం,
6:00 నుండి 12:00 సర్వదర్శనం,అభిషేకాలు,అర్చనలు,
మధ్యాహ్నం

12:00 మధ్యాహ్నకాలార్చన,
12:15 రాజభోగం,
12:15 -3:00విరామం,
3:00 నుండి 8:00 వరకు సర్వదర్శనం,పూజలు,అర్చనలు,
రాత్రి

7:30 నుండి 7:45 వరకు స్వస్తి ప్రవచనం,
7:45 నుండి 8:00 వరకు ప్రదోషకాలార్చన,నీరాజన మంత్రపుష్పాలు,ఆస్థానపూజ-పవళింపుసేవ,
రాత్రి 8:00 నుండి ఉదయం 5:00 వరకు కవాటబంధం.

పండుగలు:
  • ప్రతీ ఏకాదశీ పర్వదినములలో ఏకాంతసేవ,పవళింపుసేవ.
  • ప్రతీ మాసశివరాత్రి పర్వదినములలో గ్రామోత్సవం.
  • ప్రతీ కార్తీక పూర్ణిమతో కూడిన క్రృత్తికా నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం.
  • ప్రతీ మార్గశిర శుద్ధ చతుర్ధశి రొజున శ్రీ స్వామివార్ల జన్మ దినోత్సవం.
  • ప్రతీ ధనుర్మాసంలోనూ క్షేత్రపాలకులు అయిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలు.
  • ప్రతీ మాఘశుద్ధ ఏకాదశీ( భీష్మ ఏకాదశి )రోజున శ్రీ స్వామి వారి అమ్మవార్లకు దివ్య కల్యాణ మహోత్సవం.
  • ప్రతీ మహాశివరాత్రి పర్వదినము నందు శివరాత్రి ఉత్సవాలు జరుగును.
  • శరన్నవరాత్రులు(దేవీనవరాత్రులు)- ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు.
  • కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు - జ్వాలాతోరణం (కార్తీక పున్నమి నాడు).
  • సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం- మార్గశిరశుద్ధ షష్ఠి నాడు.


వసతి:
              ప్రతీ నిత్యం భక్తులు ఆంధ్ర రాష్ట్రం నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. యాత్రీకుల సౌకర్యార్ధము ఇచ్చట పైండా వారిచే నిర్మించబడిన అన్నసత్రం కలదు. దేవస్థానం వారి యాత్రికుల వసతి గృహము ఆలయానికి 1/2 కి.మీ దూరంలో ఆర్.టి.సి బస్టాండుకు దగ్గరలో కోటిపల్లి రోడ్డులో కలదు. డార్మెట్రీ పెద్దది 1 రోజునకు రూ.200/-లు, డార్మెట్రీ చిన్నది 1 రోజునకు రూ.100/-లు.

ఎలా వెళ్ళాలి:
  1. కాకినాడరాజమండ్రివిజయవాడ నుండి చాలా బస్సులు ఉన్నాయి. కార్తీక లో APSRTC ఒకే రోజులో వాటిని అన్ని కవర్ అయ్యెల ప్రత్యేక పర్యటన బస్సులు నిర్వహిస్తుంది.
  2. సమీప రైల్వె స్టేషన్ సామర్లకొట ఉంది. సామర్లకొట వరకు రైలు మార్గం ద్వార వెల్లి అక్కడి నుండి బస్ కి గని అటొ కి గని వెల్లవచ్చు.
  3. సమీప విమానాశ్రయాలు రాజమండ్రి లేదా విజయవాడ వద్ద ఉన్నాయి.