Tuesday, October 20, 2015

అన్నవరం (Annavaram)

అన్నవరం




                     
                     అన్నవరం - పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం అయి ఒక శతాబ్దము పైగా మాత్రమే ఐనా చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ని దర్శించేందుకు గుడివరకు ఘాట్ రోడ్డు నిర్మించారు. మెట్లు గుండా కూడ వెళ్ళవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండువగా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత; చూచి తీరవలసిన సుందర దృశ్యం. ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం)వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అనిన+ వరం = అన్నవరం) "అన్నవరం దేవుడు" అంటారు.

స్థలపురాణం





                                  స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన  మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలం గా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి గా వెలసే రత్నగిరి, లేదారత్నాచలం కొండ గా మారుతాడు.
తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.
మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు(సం. కృష్ణకుటజము) కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీని (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.

ఆలయాన్ని సా. శ.1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.

అన్నవరం లో దర్శించవలసిన ఆలయాలు

శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయము.

                                   రత్నగిరి కొండల పై శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి ప్రధాన దైవం. అన్నవరం లో శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనక దుర్గమ్మ గుడి కూడా ఈ రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం లో ఉన్నాయి. కొండ క్రింద గ్రామ దేవత గుడి ఉన్నది.

ఆలయ విశేషాలు

అన్నవరం వద్ద పంపా నది ఉంది

పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి.ప్రధాన ఆలయం రథాకారం లో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాల తో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణం లో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి.
ఈ ఆలయం ఆ ప్రకారం రెండు అంతస్థులలో నిర్మింపబడింది.క్రింది భాగం లో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగం లో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులు గా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తు లో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది.
సత్యనారాయణస్వామి  మంత్రం

శ్రీ సత్యనారాయణ స్వామివారిని
"మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్త్యెక్య రూపాయతేనమః " అని స్తుతిస్తారు.

విశేష పండుగలు

రత్నగిరి పై ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణ మే.
శ్రావణ శుద్ధ విదియ - శ్రీసత్యనారాయణస్వామి జయంతి.
వైశాఖ శుద్ధ దశమి-వైశాఖ బహుళ పాఢ్యమి ( ఐదు రోజులు) శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి.
వైశాఖ శుద్ధ ఏకాదశి- స్వామివారి కళ్యాణం
చైత్ర శుద్ధ పాడ్యమి - ఉగాది - పంచాగశ్రవణం
శ్రీరామనవమి - చైత్ర శుద్ధ నవమి - శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలు
చైత్ర బహుళ షష్ఠి - కనక దుర్గమ్మ జాతర
సరస్వతీ పూజ
శ్రీకృష్ణాష్టమి- శ్రీ కృష్ణ జయంతి
వినాయక చవితి - గణపతి నవరాత్రులు
దేవీ నవరాత్రులు - యంత్రాలయం లో లక్ష కుంకుమార్చన
విజయదశమి
దీపావళి
కార్తీక పౌర్ణమి - గిరి ప్రదక్షిణ - జ్వాలాతోరణం
కార్తీక శుద్ధ ద్వాదశి - తెప్పోత్సవం
మహాశివరాత్రి - లక్ష బిల్వార్చన
స్వామి దర్శన వేళలు ఉదయం 6 గం నుండి రాత్రి 8 గం వరకు.
అన్ని వర్గాల వారికి వసతి భోజన సదుపాయాలు ఉన్నాయి.

ఇంకా దర్శనీయ స్థలాలు

                          పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాల నిర్ణయ, నిర్దేశక యంత్రం రత్నగిరి పైన ప్రధాన ఆలయానికి ప్రక్కన ఉంది. సూర్యుని నీడ (ఎండ) ఆధారంగా కాల నిర్ణయం చేసి, పని చేసేగడియారం ఇది.
తులసివనం
వనం మధ్యలో పాముపుట్ట
ఉద్యానవనం. ఇక్కడ భక్తులు సేదతీరేందుకై ఏర్పాటు చేయబడిన ఉద్యానవనంలో అందమైన పూలమొక్కలు,పొగడచెట్లు,పూజలకు ఉపయోగపడే పలు పత్రిమొక్కలు పెంచబడుతున్నవి.ఉధ్యానవనం మధ్య మధ్య కూర్చునేందుకు వీలుగా సిమెంట్ బల్లలు కట్టబడ్డాయి.

ఆలయ పునరుద్ధరణ

                     1970లో ఆలయం మీద పిడిగు పడి ఆలయవిమాన గోపురం పగులుబారటంతో రుద్రాక్షమడపం మీద పగులువారి వర్షపు నీరు విగ్రహాల మీద పడుతుందని ఆలయ నిర్వాజకులు ఆలయానికి పునరుద్ధరణ్జ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైటు నిర్మాణాలు చేపట్టారు. ఈ పనుల కొరకు తమిళనాడు నుండి 1000 టన్నుల గ్రామైట్ తీసుకువచ్చారు. దిగువ మరియు మొసటి అంతస్థుకు మాత్రమే 900 టన్నుల గ్రానైటు రాయి వాడబడింది. పునర్నుర్మాణానికి ముందు చిన్నదిగా ఉన్న గర్భాల్స్యాన్ని కొంచం విశాలంచేసి ఆలయ ప్రధాన ధ్వారాన్ని పెద్దదిచేసి ఎక్కువ మంది భక్తులు దర్శానం చేసుకునే వీలు కల్పించబడింది. దిగువన ఉన్న యంత్రమందిరం కూడా విశాలం చేయబడింది.

స్వర్ణాలంకరణ

                       పునరుద్ధరణలో భాగంగా నారాయణ గోపుర కలశం, గణేశ, బాలాత్రిపుర సుందరి, సూర్యనారాయణ, శంకర పంచాయత కలశాలు స్వర్ణపుపూత పూసుకున్నాయి. క్షేత్రపాలకులయిన రామాలయ గోపుర కలశం, ఆంజనేయస్వామి గోపురకలశం కూడా బంగరుపూతపూయబడ్డాయి. రుద్రాక్షమండపం, మంకరతోరణం, ద్వారాలు, ఊయలకు కూడా బంగారు పూత పూయబడ్డాయి.

అన్నవరం ఎలా వెళ్ళాలి ?
                                                               అన్నవరం (Annavaram) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామము. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. ఈ గ్రామం లోని అన్నవరం రైల్వే స్టేషను విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గం లో వస్తుంది. అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. తూర్పు గోదావరి జిల్లా లో శంఖవరం మండలానికి చెందిన గ్రామము. ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే కార్తీకమాసంలో ఇచ్చట కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు.