Thursday, October 22, 2015

శ్రీకాళహస్తీ (Srikalahasti)


శ్రీకాళహస్తీ

దేశము: భారతదేశం
రాష్ట్రం:   ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:    చిత్తూరు
ప్రదేశము: శ్రీకాళహస్తి



క్షేత్ర పురాణము:
                                          సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమునకెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు.
            ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ , అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.
కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడ నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు.
              ఈ దేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకములయిన చిత్రములు వున్నాయి. " మణికుండేశ్వరాఖ్య " అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారకమంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము. దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము కలదు. దేవాలయమునకు సమీపములోగల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాసమనియు, సత్య మహా భాస్కరక్షేత్రమనియు , సద్యోముక్తిక్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.

ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరుడు మీద శతకం వ్రాశాడు. 
అందులొ శ్రీ కాళహస్తి స్థలపురాణం స్పృశిస్తూ

ఏవేదంబు పఠించెలూత భుజంగంబే శాస్త్రముల్ చదివె తా
నేవిద్యాభ్యాసమొనర్చె కరి చెంచే మంత్రమూహించె బో
ధావిర్భావ విధానముల్ చదువులయ్యా కావు మీపాద సం
సేవా శక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!


చరిత్ర:

              క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రమును గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్థావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించారు.

                ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్థంభాలు కలిగిన మంటపం మరియు అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం మే 26, 2010 న కూలిపోయింది. పది సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్ళు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మత్తులు చేస్తూ వస్తున్నారు అయితే కూలిపోక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒక వైపు బాగా బీటలు వారింది. మరో రెండు రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు కానీ రెండు రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమయింది. ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణలతో కూడిన ఒక కమిటీని నియమించింది.

                        క్రీస్తుశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టై కి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు.

దేవాలయ చరిత్ర, ప్రత్యేకతలు:

     ఈ దేవాలయము యొక్క పేరు మూడు జంతువుల కలయికతో ఏర్పడినది.
 ·         శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ల పేరుతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందినది.
·         ఇది స్వర్ణముఖి నది తీరములో ఉన్న క్షేత్రము. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖముగా ప్రవహించడం జరుగుతున్నది.
·         ఈ దేవాలయములోని లింగము పంచభూత లింగములలో ఒకటైన వాయులింగము.


ఆలయ విశేషాలు:
                                   ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వరస్వామి సాంకేతిక కళాశాల ను 1997లో స్థాపించారు.

నాలుగు దిక్కుల దేవుళ్ళు:
                                                   గుడి గర్భాలయంలోని శ్రీకాళహస్తీశ్వర, జ్ఞాన ప్రసూనాంబ విగ్రహాలు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు)గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.

గోపురాలు:
                     ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు, మరియు 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా "తేరు వీధి"కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమరూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిచ్చాలు" దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని "బాల జ్ఞానాంబి గోపురం" అని, ఉత్తరం గోపురాన్ని "శివయ్య గోపురం" అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున "సూర్య పుష్కరిణి", ఎడమవైపున "చంద్ర పుష్కరిణి" ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.

ఇతర శివలింగాలు, పరివార దేవతలు:
                            ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్టింపబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి - అర్ధ నారీశ్వర లింగము; అగస్త్యుడు - నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు - మణి కంఠేశ్వర లింగము; ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్టించినవనే లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై యున్నాడు.

                            ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి.

మంటపములు:


                             ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, నూరుకాళ్ళ మంటపము (రాయల మంటపము), పదునారు కాళ్ళ మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని. నూరుకాళ్ళ మంటపం చక్కని శిల్పాలకు నిలయం. పదహారు కాళ్ళ మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు (కృష్ణదేవరాయలు సోదరుడు) పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలున్నాయి.

రాహు కేతు క్షేత్రము:
                                           ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.

దక్షిణామూర్తి:
             దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.

సేవలు:
              ఆలయంలో జరిగే కొన్ని సేవలు - కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్ర నామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వరస్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం (ఉదయం), ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష (రాహు కేతు) పూజ, పౌర్ణమినాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహ వాహనము.

తీర్ధాలు:
                      ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయట. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని "పాతాళ గంగ" లేదా "మూక తీర్థము"లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.

ఇతర విశేషాలు:
                         ధర్మ కర్తల మండలి పరిపాలనలో, దేవాదాయ శాఖ అధ్వర్యంలోఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి. (2007 నాటికి) దేవస్థానానికి ఆదాయం షుమారు 7 కోట్ల రూపాయలు ఉంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పధకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం జరుగుతున్నది.
పండుగలు:
                       పండుగల విషయానికొస్తే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా నాలుగు ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవం ప్రధానమైన మూడు రోజులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నిర్వహిస్తుంది. అన్నింటి కన్నా ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనార్థం విచ్చేస్తారు. ఈ రద్దీని తట్టుకోవడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు,సంగీత వాయిద్య కారులు, భక్తులను తమ కౌశలంతో రంజింప జేస్తారు.

                      ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ కళాకారుల్లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ, ప్రముఖ నటి మరియు భరత నాట్య కళాకారిణి శోభన, నేపథ్య గాయకులు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, మొదలైనవారు ముఖ్యులు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని మరియు అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్ళి చేసుకోలేని పేదలు స్వామి, అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్ళి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ.

                     ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలసిన కనక దుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ తొమ్మిది రోజులపాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని 2006లో విస్తరించడం జరిగింది. మరి కొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

                   ధర్మరాజుల స్వామి తిరునాళ్ళు కూడా ఐదు రోజులపాటు విశేషంగా జరుగుతాయి. ద్రౌపదీ అమ్మవారు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది. విరాటపర్వం చదివిన రోజున పట్టణంలో ఖచ్చితంగా వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు. ఉత్సవాలలో ప్రధాన భాగంగా ఐదవరోజున సుమారు 2000 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు.

                     ఇంకా ప్రతీ సంవత్సరం డిసెంబరు నెలలో జరిగే ఏడు గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే. ఈ ఉత్సవాలలో భాగంగా పట్టణం లోని ఏడు వీధులలో ఏడు రూపాలలో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్టిస్తారు. ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి ఈ ఏడు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధులలో ప్రతిష్టిస్తారు. ఆ గంగమ్మ విగ్రహాలు జీవం ఉట్టి పడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం.

పాతాళ గణపతి ఆలయము:
                                         ఈ ఆలయమునకు ప్రవేశద్వారము వైపున పాతాళ గణపతి ఆలయము కలదు. ఇందులోనికి ప్రవేశము ఒకసారికి ఒకరికి మాత్రమే కలదు. మెట్లద్వారాలోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గము లోనికి కలదు. దాదపు 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం కలదు. ఈ స్వామి కోర్కెలు తీర్చేవాడని ప్రసిద్ధి.


ఎలావెళ్ళాలి ?


రోడ్డు మార్గం ద్వారా -
                                       ఛెన్నై నుండి శ్రీకాళహస్తి 120 km
                                              తిరుపతి నుండి శ్రీకాళహస్తి 37.0 km
                                              నెల్లుర్ నుండి శ్రీకాళహస్తి 96.5 km
రైలుమార్గం ద్వారా -
                                 రైలుమార్గ ద్వారా చేరుకొవాలనుకునేవారు రేణి గుంట స్టేషన్ లో దిగి ఇక్కడికి చేరుకొవచ్చు.
ప్లైట్ ద్వారా -
                       ప్లైట్ ద్వారా శ్రీకాళహస్తి చేరుకోవాలనుకునేవారు దగ్గరలోని ఎయిర్ పోర్ట్ రేణి గుంట నుండి ఇక్కడికి చేరుకోవచ్చు.

Wednesday, October 21, 2015

ద్వారకా తిరుమల (Dwaraka tirumala)



ద్వారకా తిరుమల




     ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు వచ్చినది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందినది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు.

"పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము.


పేరు వెనుక చరిత్ర:
                              ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో వుంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడు, ఆయనకు ముసలితనం వచ్చి ఆలయానికి అంతదూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు. ఐతే చెట్లుకొట్టి కట్టెలు అమ్ముకోవడం-దారుకము వృత్తిగా కలవారు , దారువులు(చెట్లు) ఎక్కువగా వుండడంతో, మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం వుంది.[2] తిరుమలను పెద్ద తిరుపతిగా వ్యవహరిస్తూ ఆ క్రమంలోనే దీనిని చిన్న తిరుపతిగా వ్యవహరిస్తూంటారు.

ప్రధానాలయం:

                          ప్రస్తుతము ఉన్న గుడిని మైలవరం జమీందారులు కట్టించారు. విమానము, మంటపము, గోపురము, ప్రాకారాలను ధర్మా అప్పారావు (1762-1827) కాలంలో కట్టించారు. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు రాణీ చిన్నమ్మరావు (1877-1902) సమర్పించారు.


స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలము నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్టించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.

ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహము క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చును. ఈ గుడి యొక్క సాంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు కళ్యానోత్సవములు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం- స్వయంభూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్టించారనీ చెబుతారు.

గుడి ప్రవేశంలో కళ్యాణ మంటపం ఉంది. మంటపం దాటి మెట్లు ఎక్కే ప్రాంభంభంలో (తొలిపమెట్టు వద్ద) పాదుకా మండపంలో స్వామి పాదాలున్నాయి. శ్రీపాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు ప్రక్కలా దశావతారముల విగ్రహములు ప్రతిష్టింపబడినవి. మెట్లకు తూర్పునైపున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం ఉన్నాయి. పడమటివైపు పద్మావతి సదనం, దేవాలయం కార్యాలయం, నిత్యకళ్యాణ మండపం ఉన్నాయి.


ప్రధాన ద్వారం లోపల ఇరువైపుల, గర్భగుడికి అభిముఖంగా, ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం పైభాగాన (లోపల) సప్తర్షుల విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 మంది ఆళ్వారుల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మంటపం ఉన్నది. ప్రధాన మందిరంలో ఆంజనేయస్వామి, గరుడస్వామిల చిన్న మందిరాలు (ధ్వజస్తంభం వెనుక) ఉన్నాయి.

గర్భగుడిలో స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్టింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజ చేస్తారు.


ప్రధానాలయానికి తూర్పువైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, పడమటినైపున తిరువంటపడి పరికరాలశాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం ఐదు అంతస్థులది. గోపురములో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు. గుడి ప్రాకారము చుట్టూ పన్నెండుగురు ఆళ్వారుల విగ్రహములు ప్రతిష్టింపబడ్డాయి.

పడమరవైపు ప్రక్కనే తలనీలాలు సమర్పించుకొనే కళ్యాణ కట్ట ఉన్నది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం ఉన్నాయి.

పుష్కరిణి:
               గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్ధమనీ అంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్ళపై సుదర్శన (చక్రం) ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. 199లో పుష్కరిణి మధ్య మడపం నిర్మించారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) నాడు తెప్పోత్సవం జరుపుతారు. గ్రామం లోపల విలాస మండపం, క్షీరాబ్ది మండపం, ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపం అనే కట్టడాలు వేరువేరు చోట్ల ఉన్నాయి. పర్వదినాలలో తిరువీధుల సేవ జరిగినపుడు ఆయా మండపాలలో స్వామిని "వేంచేపు" చేసి, అర్చన, ఆరగింపు, ప్రసాద వినియోగం జరుపుతారు.

అర్చన, కైంకర్యం, ఉత్సవాలు:
నిత్య కార్యక్రమాలు - సుప్రభాతం, తీర్ధపు బిందె, ప్రాతఃకాలార్చన, బాలభోగము, గోష్ఠి, ప్రత్యేక దర్శనము (06:00 నుండి 13:00),
అర్జిత పూజలు, వేద పారాయణము, మహా నివేదన (12:00), విరామం (13:00 నుండి 15:00 వరకు దర్శనం ఉండదు),
ప్రభుత్వోత్సవము, సర్వ దర్శనము (15:00 నుండి 17:00 వరకు), పంచాంగ శ్రవణము, ప్రత్యేక దర్శనము (17:00 నుండి 21:00 వరకు)
సాయంకాలార్చన, సేవాకాలము, పవళింపు సేవ, ఏకాంతసేవ తీర్మానము (21:00)
విశేష ఉత్సవాలు - 
ప్రతినెల ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య తిథులకు, పునర్వసు, శ్రవణ నక్షత్రాలకు, సంక్రమణం రోజులలో- రాత్రి 7:30కి విశేష ఉత్సవం - ప్రత్యేకమైన మూల మండపంలో స్వామివారి వేంచేపు, అర్చన, ప్రసాద వినియోగం
ఉగాది ఉత్సవం - చైత్రమాసం ఉగాదికి - ఉగాది మండపంలో వేంచేపు, పంచాంగ శ్రవణం, పండిత సన్మానము
శ్రీరామనవమికి శ్రీసీతారామకళ్యాణం, కృష్ణాష్టమికి ఉట్లపండుగ
తిరుకళ్యాణోత్సవాలు - వైశాఖమాసం (శుద్ధ దశమి నుండి నిదియ వరకు) మరియు ఆశ్వయుజమాసం (విజయ దశమి నుండి విదియ వరకు) - అలంకరణ, సాంస్కృతిక ఉత్సవాలు, భజనలు, ఉపన్యాసాలు, కళ్యాణోత్సవం, రధోత్సవం వంటివి.
పవిత్రోత్సవాలు - శ్రావణ మాసంలో - శుద్ధ త్రయోదశినుండి మూడు రోజులు - పూర్ణిమనాడు పూర్ణాహుతి
తెప్పోత్సవం - కార్తీక మాసం క్షీరాబ్ధి ద్వాదశి నాడు - సుదర్శన పుష్కరిణిలో
అధ్యయన ఉత్సవాలు - మార్గశిరమాసం - ధనుర్మాసం నెల రోజులు ఉదయం తిరువీధి సేవ- ముక్కోటి ఏకాదశినాడు ఉత్తర ద్వార దర్శనం, తరువాత 11 రోజులు అధ్యయన ఉత్సవం మరియు రాత్రి తిరువీధి సేవ.
గోదా కళ్యాణం - పుష్యమాసం - భోగి నాడు- మరియు తిరువీధి సేవ
గిరి ప్రదక్షిణము - పుష్యమాసం - కనుమ నాడు- తిరువీధి సేవలో స్వామివారు గ్రామం పొలిమేర దాటి దొరసానిపాడులో ప్రత్యేక మండపంలో అర్చన, ప్రసాదానంతరం గిరిప్రదక్షిణ పూర్వకంగా ద్వారకా తిరుమల గ్రామంలో ప్రవేశిస్తారు.
మాఘ మాసం రధ సప్తమి, ఫాల్గుణ మాసం డోలా పౌర్ణమి దినాలలో విశేషముగా తిరువీధి సేవలు జరుగును.

ఇతర ఆలయాలు:

భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయం :
                                                                       కొండపైన ప్రధానాలయానికి నాయువ్య దిశలో కొద్దిదూరంలోనే కొండమల్లేశ్వరస్వామి, భ్రమరాంబికల ఆలయం ఉంది. భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు. మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదనీ, తలపైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ చెబుతారు. ఈ దేవాలయంలో గణపతి, భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి కొలువుతీరు ఉన్నారు. నవగ్రహ మందిరం కూడా ఉంది. ఆలయం తూర్పున "శివోద్యానం" అనే పూలతోట ఉంది. సమీపంలోనే టూరిజమ్ డిపార్ట్‌మెంటు వాఱి "పున్నమి" అతిథి గృహం ఉంది. ఇటీవలి కాలంలో కొడపైభాగాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

కుంకుళ్ళమ్మ (రేణుకా దేవి) ఆలయం
                                                                         కొండకు 1 కి.మీ. దూరంలో, భీమడోలు నుండి ద్వారకా తిరుమల మార్గంలో "కుంకుళ్ళమ్మ" ఆలయం ఉంది. ఈమె ఈ వూరి గ్రామదేవత. ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకొన్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.
వెంకటేశ్వర స్వామి, జగన్నాధ స్వామి ఆలయాలు : 
                                                          ద్వారకా తిరుమలకు 2 కి.మీ. దూరంలో, భీమడోలు మార్గంలో ఉన్నాయి. హవేలి లింగపాలెం గ్రామ పరిధిలో షుమారు 130 సంవత్సరాల క్రితం పూరీ (ఒడిషా)కి చెందిన "మంత్రరత్నం అమ్మాజీ" అనబడే లక్ష్మీదేవి అనే భక్తురాలు ఇక్కడ తమ ఇలవేల్పు వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మింపజేసింది. అప్పటినుండి ఆ గ్రామానికి లక్ష్మీపురం అనే పేరు వాడుకలోకి వచ్చింది. వారిది పూరీ జగన్నాధమఠం కనుక జగన్నాధ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు, జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్ర, ఆళ్వారుల సన్నిధులు ఉన్నాయి. ద్వారకా తిరుమలను ఎగువ తిరుపతిగాను, ఈ లక్ష్మీపురాన్ని దిగువ తిరుపతిగాను భక్తులు భావిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈ స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. 1992 లో ఈ ఆలయాన్ని నిర్వహణ కొరకు ద్వారకాతిరుమల దేవస్థానానికి అప్పగించారు.

కొండక్రింద గ్రామంలో సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. పుష్కరిణి మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. ఉగాది మండపం ఎదురుగా రామాలయం ఉన్నది.


చూదదగిన ప్రదేశాలు:
                                          భ్రమారంబా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శివోద్యానం అనే తోట ఉంది. పుష్కరిణి మార్గంలో నందనవనం అనే తోటను, ప్రధానాలయం వెనుక నారాయణ వనం అనే తోటను పెంచుతున్నారు.
భీమడోలువద్ద స్వామివారి నమూనా ఆలయం ఉంది.

వసతి విశేషాలు:
                             పద్మావతి అతిధి గృహం, అండాళ్ అతిధి గృహం, రాణి చిన్నమయ్యరావు సత్రం, సీతా నిలయం, టి.టి.డి. అతిధి గృహం వంటి వసతి గృహాలు దేవస్థానంచే విర్వహింపబడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రైవేటు వసతి గృహాలున్నాయి.

ద్వారకా తిరుమల ఎలా వెళ్ళాలి ?
                                    ద్వారకా తిరుమలనుండి తూర్పు యడవల్లి సీతారామచంద్ర దేవస్థానానికి, లక్ష్మీపురం సంతాన వేణుగోపాల జగన్నాధస్వామి ఆలయానికి, కుంకుళ్ళమ్మ ఆలయానికి ఉచిత బస్సు సదుపాయం ఉంది.


ఈ క్షేత్రం విజయవాడ - రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కి.మీ., భీమడోలుకు 17 కి.మీ., తాడేపల్లి గూడెంకు 47 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. భీమడోలులో పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి. ఈ పట్టణాలనుండి, మరియు చుట్టుప్రక్కల ఇతర పట్టణాలనుండి ప్రతిదినం అనే ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులున్నాయి.